Significance of Maha Shivaratri| ఇహంలో సుఖాన్ని, పరంలో స్వర్గాన్ని ఇచ్చే మహాశివరాత్రి

shivaratri, maha shivarathri

Maha Shivaratri

మాఘ బహుళ చతుర్దశి శివరాత్రి(Shivaratri) పర్వదినం. హిందూ పండుగల్లో ముఖ్యమైంది శివరాత్రి. ప్రతి నెలా కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి కాగా మాఘమాసంలో వచ్చే శివరాత్రి మహాశివరాత్రి. మాస శివరాత్రి దినాల్లోనూ శివునికి ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేసినప్పటికీ మహా శివరాత్రి మరింత విశిష్టమైంది, ఆరాధనీయమైంది. మహాశివుడు సాకారమైన మూర్తిగానూ, నిరాకారమైన లింగంగానూ పూజలు అందుకుంటాడు. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఏటా హిమాచల్ ప్రదేశ్, మండిలో వారం రోజులపాటు ”International Mandi Shivratri Fair” నిర్వహిస్తారు. దేశం నలుమూలల నుండి భక్తులు ఈ ఉత్సవానికి తరలివస్తారు.

పర్వదినం, పుణ్యదినం అయిన శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, జాగారం చేస్తే సమస్యలు నివారింపబడతాయి. కోరికలు సఫలమౌతాయి. పెళ్ళి కానివారికి పెళ్ళి అవుతుంది. తెలిసీ తెలీక చేసిన పాపాలన్నీ నశిస్తాయి. సద్గతులు లభిస్తాయి. మహాశివరాత్రి రోజున ఉదయానే లేచి తలస్నానం చేసి పూలూ ఫలాలతో శివునికి పూజ చేస్తారు. ముఖ్యంగా శివునికి ఇష్టమైన ”నమశ్శివాయ” అనే పంచాక్షరీ మంత్రాన్ని పఠిస్తారు. ఈరోజున ప్రతి దేవాలయమూ కిక్కిరిసి ఉంటుంది. ఇక శివాలయాల సంగతి చెప్పనవసరమే లేదు. ఇతర రోజుల్లో గుడికి వెళ్ళలేకపోయినా ఈ విశేష దినాన తప్పనిసరిగా వెళ్తారు. భక్తుల రద్దీతో ఆలయాలు కిక్కిరిసి ఉంటాయి. అభిషేకాలు, పూజలతో పరమశివుని ఆరాధిస్తారు.

భక్తుల పాలిట కల్పతరువు అయిన శివునికి ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, భజనలతో శివనామం మారుమోగుతుంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం, శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి, భక్తిప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కల్యాణం చేస్తారు. పూజలు, ప్రార్థనలు, అర్చనలు, అభిషేకాలతో ఆరాధిస్తారు. శివ స్తోత్రాలు, భక్తి గీతాలతో మహేశ్వరుని ప్రార్ధిస్తారు. రోజంతా పరమేశ్వరుని చింతనలో గడిపి, రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం.
మహాశివునికి, విభూతికి అవినాభావ సంబంధం ఉంది. అందుకే శివభక్తులు పరమ పవిత్రమైన విభూతిని ధరిస్తారు. శివరాత్రి రోజున విభూతిని తయారుచేస్తారు. భక్తులు ఈరోజున పరమేశ్వరుని ఆరాధించడమే కాకుండా తప్పులు చేయకూడదని, అబద్ధాలు చెప్పకూడదని విశ్వసిస్తారు. ఏడాది పొడుగునా ఏ పూజలూ చేయనివారు కూడా మహా శివరాత్రి నాడు ఈశ్వరుని ప్రార్ధించి శివ సన్నిధి పొందినట్లు పురాణాలలో ఎన్నో కధలు ఉన్నాయి. ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుంది అంటారు. శివుని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక. అందుకే “భక్తవశంకర” అన్నారు. గుణనిధి కధ ఇందుకు సాక్ష్యం.

బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలూ పట్టవు. దుర్గుణాలన్నీ అలవరచు కుంటాడు. అన్ని విధాలుగా పతనమైన అతను మహా శివరాత్రి నాడు కావాలని కాకున్నా, అన్నం దొరక్క ఉపవాసం ఉంటాడు. ప్రసాదం దొరుకుతుందనే ఆశతో దేవాలయానికి వెళ్తాడు. చీకటిలో కనిపించక అవసరం కోసం దీపం వెలిగిస్తాడు. జాగారంలో తూగుతున్న భక్తుల అలికిడికి భయపడి పారిపోబోయి అనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాలు విడుస్తాడు. ఆవిధంగా ముక్తి పొందుతాడు. అదీ సంగతి. శివరాత్రి మహత్యం అంతటిది.

 

1 thought on “Significance of Maha Shivaratri| ఇహంలో సుఖాన్ని, పరంలో స్వర్గాన్ని ఇచ్చే మహాశివరాత్రి”

  1. Pingback: 100+ Sankranti Wishes 2025 to Send to Your Loved Ones Varthapedia.com

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top