ఆదిత్య హృదయం చదివితే ఏమవుతుంది !!

SuryaDeva%25281%2529
శ్రీకృష్ణుడు భగవద్గీతని ఏ సందర్భంలో చెప్పాడో మనందరికీ తెలిసిందే! కురుక్షేత్ర సంగ్రామంలో తన రక్తసంబంధీకులతో యుద్ధం చేసేందుకు అర్జునుడు విముఖుడు కావడంతో… తనని కార్యోన్ముఖుని చేసేందుకు సాగిన బోధే భగవద్గీత. రామాయణంలోనూ ఇలాంటి సందర్భం ఒకటి ఉంది. ఆ సమయంలో వెలువడిన స్తోత్రమే ఆదిత్య హృదయం.

అది రామాయణంలోని యుద్ధకాండ. లంకలోకి అడుగుపెట్టిన రాముని ఎదుర్కొనేందుకు, రావణుడు భీకరమైన రాక్షసులందరినీ యుద్ధభూమికి పంపాడు. అలా తన మీదకు వచ్చినవారిని వచ్చినట్లుగా సంహరిస్తున్నాడు రాముడు. ఒకపక్క వారితో యుద్ధం చేస్తున్న ఆయన శరీరం అలసిపోతోంది. అంతకుమించి తన కళ్లెదుట జరుగుతున్న మారణహోమాన్ని చూసి మనసు చలించిపోతోంది. దాంతో యుద్ధం పట్ల విముఖత మొదలైంది.

అగస్త్య మహాముని రాములవారి మానసిక స్థితిని గమనించాడు. నిదానంగా ఆయన చెంతకు చేరుకుని ఆ ఆదిత్యుని కనుక ప్రార్థిస్తే ఎనలేని శక్తి లభిస్తుందనీ, అంతులేని విజయాలు పొందవచ్చనీ సూచించాడు. అలా చెబుతూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని అందించాడు. ఈ ఆదిత్య హృదయంలో 30 శ్లోకాలు ఉన్నాయి. మొదటి ఆరు శ్లోకాలలోనూ ఆదిత్యుని పూజించమన్న సూచన కనిపిస్తుంది. 7వ శక్లోకం నుంచి 14వ శ్లోకం వరకూ ఆదిత్యుని ప్రశస్తి కనిపిస్తుంది. 15వ శ్లోకం నుంచి 21వ శ్లోకం వరకూ ఆదిత్యుని ప్రార్థన సాగుతుంది. 22వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకూ ఆదిత్యహృదయాన్ని పఠిస్తే కలిగే శుభాల గురించిన వర్ణన ఉంటుంది. ఇదంతా విన్న రాములవారు కార్యోన్ముఖులు కావడాన్ని 29, 30 శ్లోకాలలో గమనించవచ్చు.

ఈ ఆదిత్య హృదయం పఠించిన తర్వాత రాముడికి విజయం అనాయాసంగా లభించిందని వేరే చెప్పాలా! రాములవారికే శుభాన్ని అందిస్తే ఇక సామాన్యులు అనుమానించాల్సిన పని ఏముంది. అందుకే జీవితంలో ఎలాంటి ఆపదలు ఎదురైనా, అనారోగ్యాలు ఏర్పడినా… ఎలాంటి ఒడిదొడుకులలోనైనా ఆదిత్య హృదయం మనల్ని ఒడ్డుకి చేరుస్తుందన్నది పెద్దల మాట. శత్రువినాశనం కావాలన్నా, దారిద్ర్యం దూరమవ్వాలన్నా, మనోవాంఛలు తీరాలన్నా ఆదిత్య హృదయం తారకమంత్రంలా పనిచేస్తుందని తరతరాల నమ్మకం.

‘మూడుసార్లు కనుక ఆదిత్య హృదయాన్ని పఠిస్తే ఈ సంగ్రామంలో విజయం సాధిస్తావు’ అంటూ సాక్షాత్తూ అగస్త్య మహర్షే 26వ శ్లోకంలో (ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి) పేర్కొంటాడు. మన అవసరాన్నీ, అవకాశాన్నీ బట్టి ఎన్నిసార్లయినా ఈ శ్లోకాన్ని పఠించవచ్చు. ముఖ్యంగా సూర్యునికి ఇష్టమైన ఆదివారం నాడు తెల్లవారుజామునే నిద్రలేచి శుచిగా స్నానం చేసి…. సూర్యునికి అభిముఖంగా నిలిచి ఈ శ్లోకాన్ని పఠిస్తే ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుందని చెబుతారు.

ఇంతకీ రాములవారే ఓ అవతారపురుషుడు కదా! మరి ఆయన ఆదిత్యుని కొలవాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న అనుమానం రాక మానదు. ఆ సందేహానికి సమాధానం ఈ స్తోత్రంలోనే కనిపిస్తుంది. ఆదిత్య హృదయం అంటే ఆదిత్యుని హృదయం అన్న అర్థంతో పాటు ‘ఆదిత్యుని కలిగి ఉన్న హృదయం’ అన్న అర్థం కూడా వస్తుంది. ప్రతి మనిషిలోనూ ఉన్న పరబ్రహ్మకు ప్రతిరూపమే ఆ ఆదిత్యుడు. ‘ఈ దేహం నాది’ అనుకున్నప్పుడు మనం ఈ సృష్టికంటే భిన్నమైనవారం అనుకుంటాము. కానీ ‘ఈ సృష్టికి నేను కూడా ఒక ప్రతీకని’ అనుకున్నప్పుడు ఎలాంటి ఎల్లలూ లేని ఆత్మస్వరూపాన్ని దర్శించటగలం.
ఆదిత్యుడు అన్న పేరుని వాడటం వెనుక ఉద్దేశం ఇదే కావచ్చు! ఆదిత్యుడు అంటే ఆద్యంతాలు లేనివాడు అని అర్థం. ఆ ఆదిత్యుని మనలోనే దర్శించిన రోజున ఎలాంటి పరిమితులూ మనకి అడ్డంరావు. అందుకే సమస్త దేవతలకూ ప్రతీకగా, అజ్ఞానాన్ని రూపుమావేవాడిగా, సకల ప్రాణులలో ఉండే అంతర్యామిగా, సృష్టిస్థితిలయకారునిగా… ఆ ఆదిత్యుని ఈ స్తోత్రంలో పేర్కొన్నారు.

_____________________________________________________________
ఇంకా ఇలాంటి ఆసక్తి కరమైన విషయాలు తెలుసుకోవాలంటే “FOLLOW” అవ్వండి
_____________________________________________________________

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top